కంగ్రాచ్యులేషన్స్ .. పిరమిడ్ మాస్టర్స్ !

 

“ఆటలు – పాటలు?” .. “సంగీతం?” .. “సైన్స్ పరిశోధనలు?” .. “ప్రకృతి పరిరక్షణ ?” “సామాజిక సేవ ?” .. “దేశ ఉద్ధరణ ?” “ఆత్మకల్యాణం?” .. “లోకకల్యాణం?” ..

“భౌతిక తలం మీద మరో జన్మ తీసుకోవాలి .. మరో భౌతికకాయం ద్వారా మరిన్ని అనుభవాలను పొందాలి ; మరింత ప్రగతి సాధించాలి” అని ఊర్ధ్వలోకాల ఆత్మలు నిర్ణయం తీసుకున్నప్పుడు .. ఊర్ధ్వలోకాల మహాత్ముల సలహాలతో .. వారు సరిక్రొత్త తల్లిదండ్రులను ఎన్నుకుంటారు.

“ఎక్కడ పుట్టాలి?” .. “ఎవరికి పుట్టాలి?” .. “ఏ కారణంతో పుట్టాలి?” .. “ఆడగానా ?” .. మగగానా?” .. “ఏం సాధించాలి?” .. “ఎవరెవరితో కలిసి పనిచేయాలి?” .. “క్రొత్త కర్మ అంటుకోకుండా పాత కర్మను ఏ విధంగా దగ్ధం చేయగలను?” అంటూ పరిపరి విధాల ఆలోచించి ఒకానొక సక్రమమైన ప్రణాళికతో “మరో జన్మ” అనే ” మరో సాహస కార్యక్రమం ” లో పాల్గొంటారు.

భౌతికతలంలోకి రావడమంటే అది ఎంతో సాహసకృత్యం ! కనుకనే .. అనేకమందిలో కొంతమంది మాత్రమే భూతలం అంటే భౌతికతలం (physical plane) లోకి రావడానికి సాహసిస్తారు. ఎంతో హాయిగా వుండే ఊర్ధ్వలోకాలను వదులుకుని మళ్ళీ “కష్టాల ఊబి” లో ప్రవేశించడం ఎవరికి మాత్రం ఇష్టం? !

అయితే .. “ఊర్ధ్వలోకాల నుంచి మరింత ఉన్నత స్థాయి లోకాలకు పోవాలంటే భౌతిక శరీరధారిగా భూతలం మీద జన్మ తీసుకుని సుగుణాలను మరింత సానబెట్ట గలగాలి” అన్నది సృష్టి నియమం కనుక .. సాహస ఆత్మలు మరోసారి భూమి మీద పుట్టడానికే నిర్ణయించుకుంటాయి.

ఒకానొక ఆత్మ ప్రణాళికాబద్ధంగా తల్లిదండ్రులను ఎన్నుకున్న తరువాత ఊర్ధ్వలోకాలను వీడి భూతలంలోని కాబోయే తల్లి గర్భంలోని పిండాన్ని ఆక్రమించుకుంటుంది ! పిండప్రవేశం ఎప్పుడయినా జరుగవచ్చు .. ఒకటో నెలలో కానీ .. ఆఖరి నెలలో కానీ .. మరి ప్రసవానికి ముందు ఆఖరి రోజు కానీ !

ఒకానొక నాటకంలో లేదా .. ఒకానొక సినిమాలో పాత్రలను ఎన్నుకున్నట్లుగా మనం కూడా మన పాత్ర ఎంచుకుని మరీ పుడతాం ; జీవితాంతం ఆ ” పాత్ర వ్రాత ” .. మన జీవన విధాన దిశగా మారి మనకు అంతర్ చుక్కాని అవుతుంది.

ఇకపోతే, ఊర్థ్వలోకాల నుంచి మరింత ఉన్నతస్థాయి లోకాలకు చేరుకున్న ఉన్నతస్థాయి ఆత్మలు స్వీయఆత్మకల్యాణం పూర్తిగా పొందినవారు కనుక .. వారి తిరిగి జన్మ తలపెట్టినప్పుడు .. లోకకల్యాణం కోసమే నడుం బిగిస్తారు. ఆ కోవకు చెందినవారే “పిరమిడ్ మాస్టర్స్” !

“బోధిసత్త్వులు” అంటే ఒక దగ్గరే వుండి ఆధ్యాత్మిక విద్యనూ, ధ్యానసాధననూ బోధించేవాళ్ళు ; “బుద్ధుళ్ళు” అంటే గ్రామగ్రామాలు, పట్టణ పట్టణాలు, దేశవిదేశాలు తిరిగి ఆధ్యాత్మిక విద్యనూ, ధ్యానసాధననూ బోధించేవాళ్ళు.

గత జన్మలలోనే “బోధిసత్త్వులు” గా ఎంతో ఎత్తుకు ఎదిగి వున్న పిరమిడ్ మాస్టర్లు మరొక మెట్టు పైకెక్కి “బుద్ధుళ్ళు” గా ఎదగడం కోసం మరింత కృషి చేయడానికి నిశ్చయించుకుని ఈ సారి భూమి మీద అవతరించారు !

“ఈ సారి భూమినంతా అసలైన సిసలైన ఆధ్యాత్మికతతో ముంచుతాను ” .. ” ఈ సారి ప్రతి మానవుణ్ణీ ఒక యోగిగా, ఒక ఋషిగా చేస్తాను .. అందరినీ ఆత్మస్వరూపులుగా, నిర్భయులుగా తీర్చిదిద్దుతాను” .. “ఈ సారి జంతుప్రపంచాన్ని మానవజాతి యొక్క క్రూరాతిక్రూర చర్యల నుంచి రక్షిస్తాను” ..

” ఈ సారి ముఖ్యంగా పిరమిడ్‌లను అన్ని ప్రదేశాలలో స్థాపన చేసి .. విశ్వశక్తిని భూతలం మీదికి తీసుకుని వస్తాను ” .. ” ఈ సారి నా లాగా వున్న వాళ్ళందరితో కలిసి ఒక మహా సామూహిక వ్యవస్థను తయారుచేస్తాను .. అందరితో ఏకమై ఒక సమిష్టి స్పృహతో జీవిస్తాను ” అంటూ పతాక స్థాయిలోని లక్ష్యాలను ఏర్పరచుకున్నవారే ” పిరమిడ్ మాస్టర్స్ ” !

ఆ అత్యంత అద్భుత లక్ష్యాల సాధనకు అనుగుణంగా భౌతిక జీవితాల ప్రణాళికలను తయారు చేసుకుని భారీ ఏర్పాట్లతో, అత్యున్నత స్థాయి క్షమతలతో ఇప్పుడు ఈ భూమ్మీదికి ప్రస్తుతం వచ్చినవారే .. ” పిరమిడ్ మాస్టర్స్ ” !

గత సంవత్సరం .. 2012 సంవత్సరం పూర్తి అవుతూన్న తరుణంలో .. ” ధ్యానమహాచక్రం – 3 ” సందర్భంగా కైలాసపురిలో ” కాస్మిక్‌ పార్టీ ” ని అత్యంత ఘనంగా జరుపుకున్నాం !

వాస్తవానికి మన జన్మ ఆకాంక్షలన్నీ తీరిపోయాయి; వచ్చిన పనిని మనం మౌలికంగా పూర్తిచేసేసాం; ఇక మిగిలిన శేషజివితం కేవలం ” బోనస్ ” లాంటిదే !

“కాస్మిక్ పార్టీ” సంబరాలు చేసుకుని ఒక సంవత్సరం అయిపోయాక మళ్ళీ ఇప్పుడు ” ధ్యానమహాచక్రం – 4 ” లో వున్నాం; ఈ విధంగా “పిరమిడ్ మాస్టర్స్” గా భూమి మీదకు లోకకల్యాణార్థం వచ్చిన మహాత్ములందరికీ .. “ధ్యానమహాచక్రం – 4 “సందర్భంగా అభినందనలు !

భవిష్యత్తులో మన ” PSSM ” గురించి ప్రపంచమంతా తెలుసుకుంటుంది ! “పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్”బాటలోకి అందరూ ఆనందంగా ప్రవేశిస్తారు ! “స్వస్థితి” ని తెలుసుకోవడం ద్వారా అందరూ “స్వస్థత” ను విశేషంగా అనుభవిస్తారు ! ఇక శారీరక, మానసిక, ఆర్థిక, సాంఘిక స్వస్థతలను ప్రపంచ మానవాళి అంతా పుష్కలంగా ఆస్వాదించగలుగుతుంది.

2016 కల్లా “పిరమిడ్ జగత్” కు ప్రపంచం యావత్తు స్వాగతం పలుకుతుంది ! 2020 కల్లా “శాకాహార జగత్” అనే నినాదం ప్రపంచం అంతా మారుమ్రోగుతుంది !

ప్రతి యేటా చివరాఖరి మాసం, డిసెంబర్, లో విధిగా కైలాసపురి లో మనం కలుసుకుంటాం ! ప్రతి యేటా “ధ్యాన జ్ఞాన విజయోత్సవాలు” మహా అద్భుతంగా జరుపుకుంటాం !

“18 సూత్రాల పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ఆదర్శ విధానం” ఇప్పుడు లక్షలాది పిరమిడ్ మాస్టర్ల అనునిత్య ఆచరణాత్మక జీవిత విధానం అయిపోయింది !

అనేకానేక పిరమిడ్ పత్రికల ద్వారా .. అనేకానేక భారతీయ భాషలలో .. విశేషంగా పిరమిడ్ మాస్టర్ల ధ్యానానుభవాలు .. స్వస్థతానుభవాలు .. ఇప్పుడు లభ్యం అవుతున్నాయి. అనేకానేక పిరమిడ్ వెబ్‌సైట్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్షణక్షణం మన PSSM సమాచారం విశేషంగా విస్తరిస్తోంది. భవిష్యత్తులో అన్ని ప్రపంచ భాషలలో కూడా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ యొక్క సమాచారం లభ్యమవుతుంది ! ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా వున్న సత్యపిపాసకులు మరి ముముక్షు జనం .. అందరూ .. వారి వారి మాతృభాషల ద్వారా అసలుసిసలు ఆధ్యాత్మిక సత్యాలను అందుకుంటారు, మరి గ్రహిస్తారు.

“సత్యం వద – ధర్మం చర”

” సత్యాలనే పలకాలి – ధర్మాలనే ఆచరించాలి ” ఏమిటి సత్యాలు ?? ఏమిటి ధర్మాలు ??

వున్న అసలుసిసలు సత్యాలు నాలుగు :

1. “మనం ఆత్మపదార్థం .. అణుపదార్థం కాదు”

2. “మన వాస్తవాలు మన ఎంపికలకు ప్రతిరూపాలు”

3. “ఆత్మశక్తితో సాధించలేనిది ఏదీ లేదు”

4. “సృష్టిలో సరిక్రొత్త లోకాలు, సరిక్రొత్త ప్రాణులు ఎప్పటికప్పుడు ఉద్భవిస్తూనే వుంటాయి”

పిరమిడ్ మాస్టర్లకు వర్తించే ధర్మాలు నాలుగు :

1. “శాకాహార సేవనం .. అహింస/శాకాహార ప్రచారం”

2. “అనునిత్య ధ్యాన అభ్యాసం .. ధ్యాన ప్రచారం”

3. “అను నిత్య స్వాధ్యాయ అభ్యాసం .. స్వాధ్యాయ ప్రచారం”

4. “పిరమిడ్స్ యొక్క నిర్మాణం”

My dear Friends ! My dear Pyramid Masters ! My dear Gods ! అందరికీ 2014 నూతన సంవత్సర విశేష అభినందనలు !