ఒక గంట సేపు .. దమం
” మనస్సు మహాచంచలమైనది అది బలమైనది, అది దృఢమైనది, ప్రమాదకరమైనది .. మరి దానిని నిగ్రహించడం చాలా కష్టం వాయువును నియత్రించడం ఎంత కష్టమో .. మనస్సును నియత్రించడం అంతకంటే కష్టం “
అన్నదే అర్జున ఉవాచ
“చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్”
నిజమే .. మనస్సు మహా దుర్నిగ్రహమైనది
కనుక .. ప్రప్రథమంగా .. మనస్సుకన్నా ముందు .. ఇంద్రియాలను జయించ బూనాలి
బహిరేంద్రియ నిగ్రహం .. “దమం”
అంతరేంద్రియ నిగ్రహం .. “సమం”
మనస్సును జయించడం “సమం” .. ఇంద్రియాలను జయించడం .. “దమం”
“దమం” ను సుదీర్ఘ ప్రయత్నం ద్వారా సాధించినవాడే ధ్యాని
మరింత ప్రయత్నం ద్వారా “సమం” ను సాధించినవాడే .. యోగి
“ఇంద్రియాణాం నయనేంద్రియం ప్రధానం”
సకల ఇంద్రియాలలో అంత్యంత ప్రధానమైనవి నయనాలు
కళ్ళుమూసుకుని ఒక గంటసేపు కూర్చోవాలి
మనస్సు ఎంత గగ్గోలుపెడుతున్నా కళ్ళు మాత్రం తెరవకూడదు
మనస్సు ఎంత సతమతమవుతున్నా కళ్ళు మాత్రం తెరవకూడదు
మనస్సు ఎంత గజిబిజిగావున్నా కళ్ళు మాత్రం తెరవకూడదు
ఒక గంటసేపు కళ్ళు ససేమిరా తెరవకూడదు
ప్రారంభంలో అయిదు నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చోవడమే కష్టం ..
కానీ .. మెల్లిమెల్లిగా కూర్చోగలం
అలవాటు అయ్యాక కళ్ళు తెరవడమే కష్టంగా వుంటుంది
“తినగ తినగ వేము తియ్యగనుండు”
హాయిగా కూర్చోవాలి
ఎప్పుడూ కదులుతూ ఉండే శరీరాన్ని వీలయినంత కదలకుండా ఉంచాలి
ఎప్పుడు మాట్లాడుతూ ఉండే నోటిని ఒకగంటసేపు కట్టేసుకోవాలి
ఎప్పుడూ చూసే కళ్ళను ఒక గంటసేపు మూసి వుంచాలి
ఇదంతా “దమం” క్రింద లెక్క
“దమం” అన్నది “ఒకానొక బలవంతపు క్రియ”
“దమననీతి” అంటే “బలవంతంగా అణగద్రొక్కడం”
“బలప్రహారం” చేయవలసినది కేవలం ఇంద్రియాల మీదే
మనస్సు మీద “బలప్రహారం” అన్నది అసంభవం
ఒక గంటసేపు బలవంతంగా కళ్ళను మూసేసుకుని కూర్చోవాలి
“దమం” అభ్యాసం చేస్తూన్నప్పుడు మనస్సు అన్నది ఇంకా చంచలంగానే వుంటుంది
వాస్తవానికి “దమం” యొక్క ప్రారంభదశల్లో మనస్సు అన్నది మరింత విజృంభిస్తుంది
అయినా
అనేకానేక ఆలోచనలు తెరలు తెరలుగా వస్తూన్నా
కళ్ళు ససేమిరా తెరువరాదు .. చేతులు ఎంత మాత్రం విప్పరాదు .. ఆసనంలోంచి అస్సలు లేవరాదు
నిర్ణీత సమయం ప్రకారం
ప్రతిరోజూ “నయనేంద్రియనిగ్రహసాధన” లో ఉండి తీరవలె
క్రమక్రమంగా “దమం” ను సాధించితీరవలె
“దమం” అనే ప్రక్రియకు తోడుగా “శ్వాస మీద ధ్యాస” కూడా ఉన్నప్పుడు
“సమం” అనే మనోలయస్థితికి అత్యంత సహజంగా చేరుకుంటాం
ఒక నలభైరోజుల్లో .. ఎవరైనా సరే .. “దమం” అనే స్థితికి వచ్చి ధ్యాని అవుతారు
మరొక నలభైరోజుల్లో .. ఎవరైనా సరే .. “సమం” అనే స్థితికి వచ్చి యోగి అవుతారు
మొదటి మెట్టు తరువాతే రెండవ మెట్టు
“దమం “ద్వారానే” సమం”
first comes first .. second comes second
హాలాహలం తర్వాతే అమృతం .. పురుటి నొప్పుల తర్వాతే పురుడు
సహనంతో ” దమం ” అన్న స్థితిని దాటి .. “సమం” అన్న స్థితిలోకి ప్రవేశించవలె
“దమం” జయహో ! “సమం” జయ జయహో !!