భగవద్గీత 3-16
“ ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః | అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి || ” |
పదచ్ఛేదం
ఏవం – ప్రవర్తితం – చక్రం – న – అనువర్తయతి – ఇహ – యః – అఘాయుః – ఇంద్రియారామః – మోఘం – పార్థ – స – జీవతి
ప్రతిపదార్ధం
పార్థ = అర్జునా ; యః = ఎవరు ; ఇహ = ఈ లోకంలో ; ఏవం = ఈ విధంగా ; ప్రవర్తితం = నడుస్తున్న ; చక్రం = సృష్టిచక్రానికి ; న, అనువర్తయతి = అనుగుణంగా నడవడో ; సః = అతడు ; ఇంద్రియారామః = ఇంద్రియలోలుడై ; అఘాయుః = పాపజీవితాన్ని ; మోఘం = వ్యర్థంగా ; జీవతి = జీవిస్తున్నాడు
తాత్పర్యం
“ అర్జునా ! ఈ లోకంలో ఈ విధమైన సృష్టిచక్రానికి అనుగుణంగా ఎవడు నడవడో, అతడు ఇంద్రియాలకు లోనై పాపపు జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తున్నాడు. ”
వివరణ
నాలుగు క్షేత్రాలు ఉన్నాయి:
ఒకటి – భౌతిక క్షేత్రం
రెండు – ప్రాణశక్తి క్షేత్రం
మూడు – భావనా క్షేత్రం
నాలుగు – ఆత్మ క్షేత్రం
భౌతిక క్షేత్రానికి మూలం ప్రాణశక్తి క్షేత్రం ;
ప్రాణశక్తి క్షేత్రానికి మూలం భావనా క్షేత్రం ;
భావనా క్షేత్రానికి మూలం ఆత్మ క్షేత్రం ;
ఈ నాలుగు క్షేత్రాలలో మౌలికమైన క్షేత్రం … ఆత్మ క్షేత్రం !
సృష్టిచక్రం యొక్క మూలక్రమం తెలుసుకున్నవాళ్ళు
ఆ క్రమంలో సరిగ్గా జీవిస్తారు …
పుణ్యచరితులై అర్థపు జీవితాన్ని గడుపుతారు ;
ఈ సృష్టిక్రమం తెలియని వారు ఇంద్రియాలకు వశులవుతున్నారు ;
ఇంద్రియాలకు వశులై పాపపు జీవితం గడుపుతున్నారు ;
పాపచరితులై వ్యర్థంగా కాలం గడుపుతున్నారు.