ఎవరి వాస్తవం వారిదే …
“ఒకానొకప్పుడు గురుకులంలో శ్రీ కృష్ణుడు, కుచేలుడు మంచి స్నేహితులు. శ్రీ కృష్ణుడు రాకుమారుడు. సకల భోగ భాగ్యాలు ఉన్నవాడు. కుచేలుడు ఓ పేద బ్రాహ్మణుడు. దానికి తోడు పెద్ద సంసారం. కటిక దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్నాడు.
కుచేలుడి భార్యకు ఓ రోజు మంచి ఐడియా వచ్చింది. ఆమె తన భర్తకూ, శ్రీ కృష్ణుడికీ గల స్నేహం గురించి విని వుంది. తన ఆలోచనను భర్తకు చెప్పింది. స్నేహితుడి సహాయం కోరి రమ్మని పోరింది. సందేహిస్తూనే తప్పనిసరి పరిస్థితుల్లో స్నేహితుడి దగ్గరికి బయలుదేరాడు కుచేలుడు.”
“కుచేలుడి ఆగమనాన్ని తెలుసుకున్న కృష్ణుడు సకల రాచ మర్యాదలతో ఆహ్వానం పలికాడు. ఆత్మీయంగా పలుకరించాడు. షడ్రుచుల విందు, సంగీత నాట్యాల పొందులతో స్నేహితుడుని సంతోషపెట్టాడు. తనతో సరి సమానంగా చూసుకున్నాడు. వెంటతెచ్చిన అటుకులను కూడా భేషజం లేకుండా స్వీకరించాడు.”
“చిన్ననాటి కబుర్లతో, సరదాలతో అంత సమయం ఎలా గడిచిందో తెలియలేదు స్నేహితులిద్దరికీ. రెండు రోజులు గడిచాయి. వెళ్ళొస్తాను నేస్తం, అంటూ బయలుదేరాడు కుచేలుడు. మంచిది ఫ్రెండ్, వెళ్ళిరా . . . అంటూ మర్యాదగా సాగనంపాడు ఆ యోగీశ్వరుడు. అంతే ,”
“ఏముందీ . . . , ఇంటికి వెళ్ళగానే భార్య చెండాడింది. అంత దూరం వెళ్ళి ఏమీ అడగలేదా ? మీరు అడగలేదు సరే . . . అంత క్లోజ్ ఫ్రెండ్ కదా, కృష్ణుడైనా ఏమీ ఇచ్చాడు కాదేమంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి వదిలిపెట్టింది.”
“ఆ , “అంటూ ఆశ్చర్యంతో నోరు తెరిచారా ?” అదేంటి, ఇంటికి వెళ్ళేసరికి అష్టైశ్వర్యాలు వచ్చాయని విన్నాం అనుకుంటున్నారా . . .?
“అదేం లేదు, అవన్నీ కల్పితాలే. ప్రతి పురాణంలోనూ నిజమింత, కల్పితం అంత వుంటాయి.”
“అంతెందుకు ? ప్రహ్లదుడు కూడా హిరణ్యకశిపుడి దురహంభావాన్నీ, పరిమిత జ్ఞానాన్నీ తన సంప్రజ్ఞతతో జయించాడే గానీ ఏ నరసింహుడూ ఏ స్థంభంలోంచీ రాలేదు . . .
కుచేలుడు జీవితాంతం ఆ దరిద్రంలోనే వున్నాడు. అతని భార్య చిత్రహింసలు పెడుతూనే వుంది. కుచేలుడి భార్య కూడా సోక్రటీస్ భార్యలాగే గయ్యాళి. అదేమిటో గానీ చరిత్రలో గొప్ప జ్ఞానుల భార్యలు ఎక్కువ అలాగే వుంటారు…”
“అయితే కృష్ణుడు ఏమీ ఇవ్వలేదా . . .?”
“పేదరికం కుచేలుడి వాస్తవం. అతని కర్మఫలం. శ్రీ కృష్ణుడు మహాజ్ఞాని. ఇతరుల వాస్తవాలను మార్చే మూర్ఖపు పని ఆయనెందుకు చేస్తాడు ? ఆ విషయం కుచేలుడి తెలుసు కనుకే తనూ స్నేహితుడిని ఏమీ అడగలేదు.
కేవలం భార్య పోరు పడలేక వెళ్ళాడంతే. స్నేహితులున్నది బాధ్యతలు పంచుకోవడానికి కాదు. ఎవరి బాధ్యతలు వారివే.
మిత్రుడిగా కలవటానికి వెళ్ళినప్పుడు, అతిథిగా వున్నంత వరకూ కృష్ణుడి సకల భోగాలూ తనవి కూడానూ. . . అంతవరకే, ఆనక, ఎవరి వాస్తవం వారిదే. ఎవరి ప్రారబ్ధం వారిదే. ఎవరి అనుభవం వారిదే. సమఝయిందా.”
ధర్మం చాలా సూక్ష్మం.
సునిశిత బుద్ధే ధర్మాన్ని తెలుసుకునే మార్గం.
కఠోరమైనది పరమ్ సత్యం.
ఆ సత్యాన్ని గ్రహించిటమే జీవిత పరమార్థం. . .