ఎవరి అనుభవాలు వారివి.. ఎవరి జ్ఞానం వారిది

 

“‘ధ్యానం’ అనే పదం.. దాని శుభ పరిణామాలు చర్చినీయాలు కావు.. అవి అనుభవనీయం! చర్చలలో ఎవరికి ఎక్కువ వాక్చాతుర్యం ఉందో వారిది పై చేయి అవుతుందే తప్ప సత్యం బట్టబయలు కాజాలదు.”

“చదరంగం ఆడేవాడి ఆనందం.. చదరంగం అంటే తెలియనివారికి అర్థం కాదు. హిందీ, తెలుగు బాషలు తెలిసినవారికీ, ఆయా బాషల్లో ప్రావీణ్యత ఉన్నవారికీ వాటి అందాలు తెలుస్తాయి గానీ.. ఆ భాషలు రానివారు ‘పెదవులు కదులుతున్నాయి; ఏవో రకరకాల ధ్వనులు వినిపిస్తున్నాయి’ అనుకుంటారు. అనుభవనీయం కాకపోవడమే దానికి కారణం.”

“బుద్ధత్వం పొందే క్రమంలో సిద్ధార్థుడు ఎందరో గురువులను కలిసాడు. శుశ్రూష చేసాడు; అందరి సందేశాలను అందిపుచ్చుకున్నాడు; మననం చేసుకున్నాడు అయినా అన్వేషిస్తూనే ఉన్నాడు. అంతకు ముందు ఐదున్నర సంవత్సరాలు ఎంతో పరిశోధన సాగించాడు. కానీ మూడు జాముల్లోనే అతడు ‘సరియైన సాధన’ అన్నది మొదలు పెట్టి కేవలం ఒక్క రోజులోనే అన్నీ సాధించాడు!”

“బుద్ధుడయినా.. మనమయినా.. మరెవరయినా.. అందర్నీ వినాలి. ప్రతివారి దగ్గరి నుంచి చిన్నదో, పెద్దదో నేర్చుకోవలసిందంటూ ఒకటుంటుంది. ఇలా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటే ఏదో రోజున మన ‘అంతర్వాణి’ మనకు వినిపిస్తుంది”.

“జ్ఞానం అనేది అనంతమైంది. హనుమంతుని తోకలా అది ఉంటుంది కానీ దానికి అంతం లేదు. మన ధ్యాన ఉద్యమానికి ఆరాధ్యదైవం బుద్ధుడు. అయితే ఆయనను పూజించడం, పుష్పాలంకృతుని చేయడం, మంత్రతంత్రాది విద్యలను ఆచరించడం, మనకు పూర్తిగా విరుద్ధం. మనం చేసేదంతా ఒక్కటే.. ఆయనను ఆదర్శ పురుషుడిగా హృదయంలో ప్రతిష్ఠించుకోవడం..ఆయన సిద్ధాంతాలను పాటించడం. ఇది ఒక్కటి మాత్రమే ప్రతి మానవుడూ ఆయనకు ఇవ్వవలసిన అపురూపమైన కానుక.”

“బుద్ధుడంతటివాడు భూమిపైన అవతరించి చెప్పవలసిన అసలు సత్యాలు చెప్పేసాక .. మరో గురువు ఎక్కడి నుంచి వస్తాడు? వచ్చినా ఆయనను మించి ఏం చెప్తాడు? ఇంకా ఏమయినా ఉంటే కదా చెప్పటానికి! బుద్ధుడు కూడా తాను బుద్ధత్వం పొందాక ‘ఇంకా నేను తెల్సుకోవలసినవి .. ఇతరులకు తెలియచెప్పవలసిన సృష్టి రహస్యాలు ఏమయినా ఉంటే అవి నాకు చెప్పే మహాత్ముడు కనపడాలి’ అనుకుని ధ్యాన నిమగ్నడైతే .. తనకు తానే కనపడ్డాడట! ‘చిట్టచివరి నిత్యసత్యమైన గురువు బుద్ధుడే’ అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?!”

“ధ్యానం ఇతోధికంగా చేసి మన దివ్యచక్షువు ఉత్తేజితం చేసుకోవాలి. గత జన్మలు చూసుకోవాలి! అవి చూసుకుంటేనే మనకు అనేక జన్మపరంపరలో ఒకానొక జన్మ అయిన ఈ వర్తమాన జన్మ కూడా అర్థమవుతుంది..‘మన ఆత్మ ప్రయాణం ఇప్పటి తల్లిదండ్రులతో మొదలు కాలేదు’ అన్న విషయం మనకు తేటతెల్లం అవుతుంది.”

“సిద్ధార్థుడు బుద్ధునిగా పరిణితి చెందాక కూడా ఆయన తండ్రి ‘మీ ముత్తాత, తాత, నేను అందరం మహారాజులం. ఆ వారసత్వం ఇప్పుడయినా తీసుకుని రాజ్యాన్ని స్వీకరించు’ అన్నాడు. అప్పుడు బుద్ధుడు నవ్వి ‘తండ్రీ! నీ అనుభవాలు వేరు, నా అనుభవాలు వేరు. నువ్వు నీ ప్రాపంచిక బంధాలు, హోదాలతో మాట్లాడుతున్నావు. నా సంగతికి వస్తే నేను జన్మ జన్మల నుంచి ఈ బుద్ధత్వం గురించి తపించానే తప్ప తాత్కాలిక రాజభోగాలు గురించి కాదు. అనేక జన్మలు అరిహంత్‌గా, బోధిసత్వుడిగా జన్మించి చివరకు బుద్ధుడనైనాను. అందరినీ బుద్ధత్వం వైపు నడిపించటమే నా ఏకైక లక్ష్యం’ అని చెప్పాడు.

“శరీరానికి పరిమితుడు శుద్ధోధనుడు; శరీరానికి అతీతమైన ఆత్మస్థితి కలిగినవారు బుద్ధుడు.”

బుద్ధునిలో చూడాల్సిన అసలు బుద్ధత్వాన్ని ప్రపంచం మర్చిపోయింది. నిరంతరం ధ్యానప్రచారం ద్వారా ఇప్పుడు ఆ బుద్ధత్వాన్ని మనం అందరికీ మళ్ళీ గుర్తు చేస్తునాం.”