భగవద్గీత 6-35
“ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ | అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే || ” |
పదచ్ఛేదం
అసంశయం – మహాబాహో – మనః – దుర్నిగ్రహం – చలం – అభ్యాసేన – తు – కౌంతేయ – వైరాగ్యేణ – చ – గృహ్యతే
ప్రతిపదార్థం
మహాబాహో = గొప్ప బాహువులు కలవాడా ; అసంశయం = నిస్సందేహంగా ; మనః = మనస్సు ; చలం = చంచలమైనదే ; దుర్నిగ్రహం = నిగ్రహింపలేనిదే ; తు = అయితే ; కౌంతేయ = ఓ కుంతీ సుతా ; అభ్యాసేన, చ = అభ్యాసం చేత , మరి ; వైరాగ్యేణ = వైరాగ్యం వలన ; గృహ్యతే = నిగ్రహింప బడుతుంది
తాత్పర్యం
“ అర్జునా, నిస్సందేహంగా మనస్సనేది చంచలమైనది. మరి నిగ్రహించడానికి కష్టసాధ్యమైనది. అయినప్పటికీ అభ్యాసం చేత మరి వైరాగ్యం చేత దానిని సులభంగా నిగ్రహించవచ్చును. ”
వివరణ
“ మనస్సు ” అనేది అతి చంచలమైనదే !
దీనిని లొంగదీసుకోవడం అత్యంత కష్టసాధ్యమైన పనే !
అయినప్పటికీ అకుంఠిత దీక్షతో సాధన చెయ్యడం ద్వారానూ …
మరి శాస్త్రయుత వైరాగ్య భావాలను పెంపొందించుకోవడం ద్వారానూ …
దానిని సులభంగా నిగ్రహించవచ్చును.
“ అకుంఠిత దీక్ష ” అంటే “ ఏ రోజూ కుంటుపడని దీక్ష ” …
ఆ విధమైన దీక్ష వుండి తీరాలి …
మనస్సును నియంత్రణలోకి తీసుకురావాలంటే …
ప్రతిరోజూ విధిగా ధ్యానసాధన వుండి తీరాలి.
ఏ రోజూ కూడా “ రేపు చేస్తాను ” అనరాదు.
ప్రతిరోజూ కూడా ధ్యానయోగసాధనకై వినియోగింప బడాలి !
“ కుంఠిత దీక్ష ” వుంటే … ఆత్మస్థితికి చేరలేం …
కావలసింది “ అకుంఠిత దీక్ష ” !
ఇకపోతే “ వైరాగ్యం ” …
“ శాస్త్రీయమైన వైరాగ్యం ” వుండాలి …
“ అత్యాచారం ” పట్ల వైరాగ్యం వుండాలి …
ఏదీ ఎక్కువగా, అవసరమైన దానికి మించి చేయరాదు …
ఎప్పుడూ “ మధ్యేమార్గం ” లోనే జీవించాలి …
అతి సర్వత్ర వర్జయేత్ !
అదే “ శాస్త్రీయమైన వైరాగ్యాన్ని కలిగి వుండడం ” అంటే !
అలాంటప్పుడే ధ్యానయోగసాధన పుష్పిస్తుంది, ఫలిస్తుంది.