భగవద్గీత 4-40
“ అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాஉత్మా వినశ్యతి | నాయం లోకోஉస్తి న పరో న సుఖం సంశయాஉత్మనః || ” |
పదచ్ఛేదం
అజ్ఞః – చ – అశ్రద్ధధానః – చ – సంశయాత్మా – వినశ్యతి – న – అయం – లోకః – అస్తి – న – పరః – న – సుఖం – సంశయాత్మనః
ప్రతిపదార్థం
అజ్ఞః = వివేకహీనుడు ; చ = మరి ; అశ్రద్ధధానః = శ్రద్ధ లేనివాడు ; సంశయాత్మా = సంశయాలున్నవాడు ; వినశ్యతి = నశిస్తాడు ; సంశయాత్మనః = సంశయాత్ముడికి ; అయం, లోకః = ఈ లోకంలో ; న, అస్తి = ఉండదు ; న, పరః, చ = పరలోకమూ ఉండదు ; న, సుఖం = సుఖమూ ఉండదు.
తాత్పర్యం
“ శ్రద్ధాజ్ఞానాలు లేనివాడూ, సందేహాలు వున్నవాడూ, నమ్మకం లేనివాడూ … చెడిపోతాడు ; సంశయాత్మకుడు అయినవాడు ఇహపరాలు రెండింటికీ దూరమై పోతాడు. ”
వివరణ
“ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ” …
శ్రద్ధ కలిగినవాడు జ్ఞానాన్ని పొందుతాడు.
గురువులు చెప్పిన వాటినీ, స్వాధ్యాయంలో గ్రహించిన శాస్త్రవిషయాలనూ …
శ్రద్ధతో … స్వయంసాధన ద్వారా నిజ జీవితంలో నిరూపించుకున్నవాడు జ్ఞానిగా మారతాడు.
శ్రద్ధ లేనివాడు ఏ పనినీ చివరివరకు కొనసాగించలేడు … సాధించలేడు, చివరకు అజ్ఞానిగానే మిగిలిపోతాడు.
సత్యాసత్యాల, ఆత్మానాత్మల వివేచనాశక్తి లేని అజ్ఞాని
ఎందుకూ పనికిరాకుండా జీవితమంతా వృథా చేసుకుంటాడు.
మనం శాస్త్రజ్ఞుల కోవకు చెందినవారమే అయితే పరిశోధించి సత్యం తెలుసుకోవాలి.
ఆ తెలివితేటలు, బుద్ధి, చాకచక్యం లేకపోతే, పరిశోధించి చెప్పిన వాడి మాటలు అయినా నమ్మాలి.
ఈ రెండింటినీ కాదని …
మనం పరిశోధించి తెలుసుకోలేం, మరిఅవతలివాళ్ళు
చెప్పిందీ నమ్మం అని ….
ప్రతి విషయాన్నీ “ అవునో కాదో ”, “ నిజమో అబద్ధమో ” అని
అనుమానపడుతూ ఉండే …
సంశయాత్మకుడికి
ఈ లోకంలోనూ సుఖం ఉండదు,
పైలోకంలోనూ సుఖం ఉండదు ;
మనశ్శాంతి అసలే ఉండదు.
అన్నీ అనుమానాలే అయితే
మనశ్శాంతి ఎక్కడ నుంచి వస్తుంది?
“ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం ” …
జ్ఞానాన్ని పొందగలిగినవాడే
పరమశాంతిని పొందుతాడు.